వైఎస్సార్ కు ఘన నివాళులు - జక్కిడి ప్రభాకర్‌రెడ్డి.
తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారు
ప్రజా విశ్వంభర, ఎల్బీనగర్ :- దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎల్‌బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ నాయకులు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ 18వ వర్ధంతి సందర్భంగా ఎల్‌బీనగర్ కామినేని చౌరస్తాలోని ఆయన విగ్రహానికి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ హయాంలో 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ చేసిన సేవలు మరువలేనివన్నారు. వైఎస్సార్ లేని లోటు ఎప్పటికీ తీరనిదని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే ఎల్‌బీనగర్ కాంగ్రెస్‌లో పార్టీ భ్రష్టు పట్టిందని అన్నారు. ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్ నాయకత్వంలో పార్టీ పరిస్థితి దిగజారిందని జక్కిడి ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మధుయాష్కీగౌడ్‌ను ప్రశ్నించారు. నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఎల్‌బీనగర్‌లో స్పా సెంటర్ల సంస్కృతి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. పార్టీని, నియోజకవర్గాన్ని కాపాడేందుకు నాయకత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.



