జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వ్యాపారి ఇంట్లో వజ్రాభరణాలు మాయం!

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వ్యాపారి ఇంట్లో వజ్రాభరణాలు మాయం!

  • జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో వరుస చోరీయత్నాలు.. స్థానికుల్లో ఆందోళన

Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వరుస చోరీయత్నాలు కలకలం రేపుతున్నాయి. రోడ్ నంబర్ 10 పరిధిలో పక్కపక్కనే ఉన్న మూడు ఇళ్లను ఓ అగంతకుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత ప్లాట్ నంబర్ 153లో చోరీకి ప్రయత్నించిన అగంతకుడు.. అనంతరం ప్లాట్ నంబర్ 154లోని వ్యాపారి షీతల్ బాంగర్ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అయితే ఇంటి యజమాని నిద్రలేవడంతో అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

అనంతరం ప్లాట్ నంబర్ 147లోని వ్యాపారి శైలేందర్ సింగ్ ఇంట్లోకి అగంతకుడు చొరబడి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోని కప్‌బోర్డులో దాచిన విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను అపహరించినట్లు ఫిర్యాదు అందింది. చోరీకి గురైన వాటిలో ఎమరాల్డ్ వజ్రపు ఉంగరం, రెండు బ్రాస్లెట్లు, నెక్లెస్, చెవి కమ్మలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఎమరాల్డ్ నెక్లెస్, మరో బంగారు నెక్లెస్‌తో పాటు మరికొన్ని విలువైన ఆభరణాలు కూడా మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read More రామచంద్రపురంలో దారుణం.. భర్తను రాడ్‌తో కొట్టి చంపిన భార్య

ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని శైలేందర్ సింగ్ సతీమణి నీలూ కౌర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆయా ఇళ్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీ ఆధారంగా అగంతకుడి కదలికలను పరిశీలిస్తూ అతడి కోసం గాలిస్తున్నారు. షీతల్ బాంగర్ ఫిర్యాదుపై కూడా మరో కేసు నమోదు చేశారు. వరుసగా ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీకి యత్నించడం, ఓ ఇంట్లో భారీగా ఆభరణాలు అపహరణకు గురికావడంతో జూబ్లీహిల్స్‌లోని స్థానికుల్లో ఆందోళన నెలకొంది.