సాంబశివరావు కుటుంబ సభ్యులకు ఎంపీ వద్దిరాజు పరామర్శ - ఫోన్ లో కుటుంబానికి ధైర్యం చెప్పిన కేటీఆర్
విశ్వంభర, ఖమ్మం ;- పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధింపులకు గురి చేస్తున్న టీ న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలు పరామర్శించి తాము కొండంత అండగా ఉంటామని భరోసానిచ్చారు.యూరియా కోసం అగచాట్లు పడుతున్న రైతుల గురించి వార్తలు సేకరిస్తున్న సాంబశివరావుపై ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీసులు అక్రమ కేసు బనాయించడం తెలిసిందే.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం మధ్యాహ్నం ఖమ్మం బంగారయ్య నగర్ లోని సాంబశివరావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఎంపీ రవిచంద్ర పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుకు ఫోన్ చేసి సాంబశివరావు సతీమణి శ్రీదేవితో మాట్లాడించారు.పోలీసు కేసుతో అధైర్యపడవద్దని, తమతో పాటు బీఆర్ఎస్ కొండంత అండగా ఉంటుందని శ్రీదేవిని కేటీఆర్ పరామర్శిస్తూ భరోసానిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే,ప్రశ్నించే,వార్తలు రాసే,ప్రసారం చేసే విలేకరుల పై,సోషల్ మీడియా వారియర్స్, సామాజిక కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం పరిపాటిగా మారిందని కేటీఆర్ ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యపడకుండా, పిల్లలు కలత చెందకుండా చూసుకోవాలని,మీ కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని కేటీఆర్, రవిచంద్రలు సాంబశివరావు సతీమణి శ్రీదేవి,అత్త మల్లమ్మ, కూతురు సహస్రలకు ధైర్యం చెప్పారు.



