మాధాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల దందా.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
- మాధాపూర్‌లో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్.. 152 ఈ-సిగరెట్లు పట్టివేత
Hyderabad EAGLE Force: హైదరాబాద్ మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్స్ విక్రయిస్తున్న రెండు దుకాణాలపై రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ (STF) ఈగల్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మైనర్లకు నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాధాపూర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. మాధాపూర్‌లో మెట్రో పిల్లర్ 1775 సమీపంలోని ‘స్మార్ట్ స్మోక్’, దుర్గం చెరువు మెట్రో పిల్లర్ 1745 సమీపంలోని ‘స్మోక్ ఆన్ వైబ్స్’ ఔట్‌లెట్లపై అధికారులు దాడులు చేశారు.
ఈ తనిఖీల్లో మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండు ఔట్‌లెట్ల నుంచి 152 నిషేధిత ఈ-సిగరెట్లు, 34 ప్యాకెట్ల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు స్కానర్లు, రూ.9,500 నగదును కూడా అధికారులు సీజ్ చేశారు. నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా మైనర్లకు నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మాధాపూర్ ప్రాంతంలో ఇలాంటి విక్రయాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆధారంగా తదుపరి విచారణ చేపట్టారు. నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ విక్రయాలు, ముఖ్యంగా మైనర్లకు వాటి చేరువను అడ్డుకునేందుకు చర్యలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.



