అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
- అనంతపురం జిల్లాలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు
Anantapur Private Travels Bus Fire: అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు కనిపించడంతో కొంతసేపు అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
బస్సులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రయాణికులను వెంటనే కిందకు దించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు ఎలా చెలరేగాయనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బస్సులో సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగాయా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.



