మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఆటో డ్రైవర్ దారుణ హత్య

మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఆటో డ్రైవర్ దారుణ హత్య

  • అబ్దుల్ రవూఫ్‌ను హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Hyderabad Crime: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. బండ్లగూడలోని జహంగీర్‌బాద్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రవూఫ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలీనగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ రవూఫ్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు? హత్యకు అసలు కారణం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించే అవకాశం ఉంది.మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే రోజు రెండో హత్యగా స్థానికంగా ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. వరుస హత్యల ఘటనలతో అలీనగర్, బండ్లగూడ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read More ట్రాఫిక్‌కు అడ్డంగా ఆటో.. పక్కకు తీయమన్నందుకు కానిస్టేబుల్‌పై దాడి