కౌటాల స్టేడియంలో నేడు బీఆర్‌ఎస్ ధర్నా.. పాల్గొననున్న హరీశ్ రావు
- సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నిరసన.. మధ్యాహ్నం హరీశ్ రావు హాజరు
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీశ్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. సిద్దిపేట నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని కౌటాల స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, హామీల అమలు తీరుతో పాటు వివిధ ప్రజా సమస్యలను ఈ ధర్నాలో ప్రస్తావించనున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
కౌటాల కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హరీశ్ రావు మంచిర్యాలలో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, 1000 రోజుల పాలనలో చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్‌ఎస్ చేపడుతున్న ఆందోళనలపై ఆయన మాట్లాడనున్నారు. ఒకే రోజు కౌటాలలో ధర్నా, మంచిర్యాలలో ప్రెస్‌మీట్ నిర్వహించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హరీశ్ రావు పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.



