సంగమేశ్వర్, బసవేశ్వర్ ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలి: హరీశ్‌రావు

సంగమేశ్వర్, బసవేశ్వర్ ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలి: హరీశ్‌రావు

  • కాలువల్లో కలుపు మొక్కలు.. ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్న హరీశ్‌రావు

Harish Rao: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. రైతులకు నీరందించాల్సిన కాలువల్లో కలుపు మొక్కలు మొలిచే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయని ఆరోపించారు. నర్సాపూర్ రెడ్డిపల్లి వద్ద నిలిచిపోయిన కాలువ పనుల సమీపంలో తాను తీసుకున్న సెల్ఫీని ప్రస్తావిస్తూ.. అది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని హరీశ్‌రావు విమర్శించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగమేశ్వర్, బసవేశ్వర్ ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్ ప్రాంతాలకు నీటిని తరలించే కాళేశ్వరం కాలువ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More రాఖీ పండుగ పేరుతో ఆర్టీసీ చార్జీల బాదుడు..హైదరాబాద్‌-కరీంనగర్‌ టికెట్‌ రూ.400

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టులను మధ్యలోనే నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిధులు తక్షణమే విడుదల చేసి పనులు ప్రారంభించకపోతే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.