హైదరాబాద్‌లో జి. పుల్లారెడ్డి సహా 32 స్వీట్ షాపుల్లో తనిఖీలు
- బాచుపల్లిలో బర్ఫీ ఘర్ లైసెన్స్ సస్పెండ్
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో జి. పుల్లారెడ్డి సహా 32 స్వీట్ షాపులు, ఆహార తయారీ కేంద్రాల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు చోట్ల ఆహార భద్రతా నిబంధనలు పాటించకపోవడం వెలుగులోకి వచ్చింది. కొన్ని దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఆహారాన్ని సక్రమంగా నిల్వ చేయకపోవడం, సరైన పద్ధతుల్లో నిర్వహించకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.
అలాగే ఫంగస్ పట్టిన పాడైన కూరగాయలు, ఆహార పదార్థాలపై నిబంధనలకు అనుగుణంగా లేని వివరాలు, ప్యాకింగ్, ప్రదర్శనలో లోపాలను గుర్తించారు. కొన్ని ఉత్పత్తులపై వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, హామీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని దుకాణాల్లో పురుగులు, ఎలుకల సంచారం ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి, సక్రమంగా నిల్వ చేయాలని అధికారులు సూచించారు.
బాచుపల్లిలోని బర్ఫీ ఘర్‌లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడంతో ఆ సంస్థ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. మిగిలిన దుకాణాలు, తయారీ కేంద్రాల్లో గుర్తించిన లోపాలపై కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.



