నేపాల్‌లో వరద బీభత్సం.. 160 మందికి పైగా మృతి, 400 మందికి పైగా గల్లంతు
- నేపాల్ వరదల్లో భారతీయ యాత్రికులు గల్లంతు.. ఆందోళనలో కుటుంబాలు
Nepal Floods: నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నేపాల్‌లో 157 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్‌లోని గ్యిరోంగ్ ప్రాంతంలో మరో ముగ్గురు మృతి చెందినట్లు చైనా అధికారులు తెలిపారు. వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వరదల ధాటికి రోడ్లు, వంతెనలు, ఇళ్లు, వాహనాలు, విద్యుత్ ప్రాజెక్టులు భారీగా దెబ్బతిన్నాయి. టిబెట్‌లోని గ్యిరోంగ్ ప్రాంతంలో 265 మంది గల్లంతైనట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. మరోవైపు నేపాల్‌లో 400 మందికి పైగా పర్యాటకులు, విదేశీయుల ఆచూకీ తెలియడం లేదు.
కైలాస్ మానససరోవర యాత్రకు వెళ్లిన భారతీయుల్లో కూడా పలువురు గల్లంతైనట్లు సమాచారం. తాజాగా అందిన వివరాల ప్రకారం 100 మందికి పైగా భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో గల్లంతైన వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి.



