ఆత్మకూర్‌ మండలంలో రైతులకు పశుపోషణపై అవగాహన

ఆత్మకూర్‌ మండలంలో రైతులకు పశుపోషణపై అవగాహన

  • ఆత్మకూర్‌లో పశుగ్రాస నిర్వహణపై రైతులకు శిక్షణ

Atmakur Fodder Management: ఆత్మకూర్‌ మండలంలోని పంపనూరు గ్రామంలో AF Ecology ఆధ్వర్యంలో రైతులకు పశుపోషణ, పశుగ్రాస నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, పశుగ్రాస కొరత ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధరాంపురం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అనుబంధ లైవ్‌స్టాక్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ సీనియర్‌ సైంటిస్ట్‌ డా. శ్రీనివాస్‌ నాయక్‌, డా. రఘుకరణ్‌, AF Ecology ALP కోఆర్డినేటర్‌ రిజ్వానా బేగం, ఆత్మకూర్‌ మండల టీం లీడర్‌ ఓబులపతి పాల్గొన్నారు.

రైతులకు వివిధ రకాల పశుగ్రాసాలను పరిచయం చేసి, వాటి సాగు విధానం, ప్రత్యేకతలు, పశువులకు అందించే పోషక విలువలను వివరించారు. పరిశోధనా కేంద్రంలో సాగు చేస్తున్న అధిక దిగుబడి పశుగ్రాస రకాలను రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం 200 కిలోల డ్రం సైలేజ్‌ తయారీ విధానాన్ని ప్రాక్టికల్‌గా వివరించారు. పచ్చిమేత కొరత సమయంలో సైలేజ్‌ను నిల్వ చేసుకోవడం ద్వారా ఏడాది పొడవునా నాణ్యమైన పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచుకోవచ్చని తెలిపారు.

Read More లోకేష్‌ సవాల్‌ను స్వీకరించిన నిరుద్యోగులు.. డీఎస్సీ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం

సైలేజ్‌ తయారీలో మేత ఎంపిక, తేమ శాతం, గాలి ప్రవేశించకుండా బిగుతుగా నింపడం, మూసివేయడం, నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అలాగే కన్సంట్రేట్‌ ఫీడ్‌ తయారీ, వివిధ రకాల పశుగ్రాసాలను సమతుల్యంగా కలిపి టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌ (TMR) తయారు చేసే విధానాన్ని కూడా ప్రత్యక్షంగా చూపించారు. వరి గడ్డి వంటి పొడి మేతను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు యూరియా ట్రీట్‌మెంట్‌ విధానాన్ని వివరించి, దాని ప్రయోజనాలు, జాగ్రత్తలను తెలియజేశారు.

ఎల్‌నినో ప్రభావాలతో ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో పశువులకు స్వచ్ఛమైన తాగునీరు, నీడ, గాలి ప్రసరణ కల్పించడంతో పాటు సమతుల్య ఆహారం అందించాలని శాస్త్రవేత్తలు సూచించారు. పశుగ్రాసాన్ని ముందుగానే నిల్వ చేసుకోవడం ద్వారా మేత కొరతను అధిగమించవచ్చని తెలిపారు. శాస్త్రీయ పశుగ్రాస నిర్వహణ, పశుపోషణ పద్ధతులను రైతులకు చేరువ చేయడం ద్వారా పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి, రైతుల ఆదాయాన్ని కాపాడుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో ఆత్మకూర్‌ MTL ఓబులపతి, AEA భూమిక, STO చౌడయ్య, సబిహా, శ్రీ రాజు, రైతులు పాల్గొన్నారు. రైతులు సైలేజ్‌ తయారీ, కన్సంట్రేట్‌ ఫీడ్‌, TMR, యూరియా ట్రీట్‌మెంట్‌ విధానాలను ఆసక్తిగా పరిశీలించారు.

Tags: