ఈ సీజన్ నుంచే పంట భీమా పథకం.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉండేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ వర్షాకాలం నుంచే అమలు చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉండేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ వర్షాకాలం నుంచే అమలు చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. రైతులపై ఎలాంటి భారం పడుకుండా చూసుకుంటామని మంత్రి సీతక్క ప్రకటించారు. పంటలకు బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె చెప్పారు.
సీతక్క ప్రస్తుతం రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. కానీ.. రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడం.. పంట నీట మునగడంతో ఆమె తెలంగాణ రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో ఉంటూనే కీలక ప్రకటన చేశారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 3 రోజులుగా కురుస్తున్న వానలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారలకు సూచించారు. ఎలాంటి ఇబ్బందలు లేకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ప్రభుత్వం రోజుకో గుడ్ న్యూస్ చెబుతోంది. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి నిధుల సేకరణపై దృష్టి పెట్టారు. ఇప్పుడు పంట భీమా పథకంతో కూడా రైతులకు లాభం జరగనుంది.