బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు : ఈటల
విశ్వంభర, ఘట్కేసర్ : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మోసపూరిత మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ బుధవారం పోచారం మున్సిపాలిటీ వికలాంగుల కాలనీలో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు... యుక్త వయసు నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నానని, అసెంబ్లీలో సమైక్యాంధ్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ... ఏం రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటావని అవమానపరిచాడో అదే చోట ఆర్థిక మంత్రిగా రూ.లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టానని ఈటల రాజేందర్ అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తనకే దక్కుతుందని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 400కు పైగా పార్లమెంట్ స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కేసీఆర్ పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏం ఒరగబెడతారని ఎద్దేవా చేశారు. రూ.లక్ష రైతు రుణమాఫీ చేయడానికి కేసీఆర్ కు నాలుగేళ్లు పడితే...రూ.2 లక్షల రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్ కి ఇంకెంతకాలం పడుతుందోనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు బస్వరాజ్, వికలాంగుల సంఘం నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.