విశాఖలో గూగుల్‌ AI హబ్‌.. తొలి దశలో 1 GW డేటా సెంటర్‌

విశాఖలో గూగుల్‌ AI హబ్‌.. తొలి దశలో 1 GW డేటా సెంటర్‌

  • విశాఖ AI హబ్‌కు గూగుల్‌ భారీ పెట్టుబడి.. హైస్పీడ్‌ ఫైబర్‌, సబ్‌మెరైన్‌ కేబుల్స్‌

Visakhapatnam AI Hub: విశాఖపట్నం AI మౌలిక వసతుల రంగంలో కీలక కేంద్రంగా ఎదిగేందుకు మార్గం సుగమమవుతోంది. విశాఖలో ఏర్పాటు చేయనున్న AI హబ్‌పై గూగుల్‌ కీలక ప్రకటన చేసింది. 2028 చివరి నాటికి AI హబ్‌ తొలి దశను పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు గూగుల్‌ గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఎనర్జీ విభాగం ప్రిన్సిపల్‌ అలెగ్జాండర్‌ స్మిత్‌ వెల్లడించారు. వచ్చే 24 నుంచి 30 నెలల్లో తొలి దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

తొలి దశలో 1 గిగావాట్‌ సామర్థ్యంతో భారీ డేటా సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం AI హబ్‌ నిర్మాణంతో పాటు అన్ని దశల కార్యకలాపాలను రాబోయే ఐదేళ్లలో ప్రారంభించేలా గూగుల్‌ ప్రణాళిక రూపొందించింది. భారత్‌లో AI రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 2026 నుంచి 2030 మధ్య సుమారు 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్‌ ఆసక్తి చూపుతోంది.

Read More 400 ఫుల్ బాటిళ్ల గోవా మద్యం స్వాధీనం.. తాడిపత్రిలో కలకలం

విశాఖను హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో కీలక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. విశాఖ నుంచి దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు అత్యంత వేగవంతమైన, అధిక సామర్థ్యం కలిగిన ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని గూగుల్‌ భావిస్తోంది. అలాగే సింగపూర్‌, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆసియా, యూరప్‌ మార్కెట్లకు వేగవంతమైన కనెక్టివిటీ కోసం కొత్త సబ్‌మెరైన్‌ కేబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ నెట్‌వర్క్‌ను అమెరికా వరకు విస్తరించే ప్రణాళిక కూడా ఉన్నట్లు గూగుల్‌ తెలిపింది.

విశాఖ AI హబ్‌లోని 1 గిగావాట్‌ డేటా సెంటర్‌ను ఎయిర్‌ కూల్డ్‌ టెక్నాలజీతో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. డేటా సెంటర్‌ను పూర్తిగా గ్రీన్‌ ఎనర్జీ ఆధారంగా నిర్వహించడంతో పాటు కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ను సాధ్యమైనంత తక్కువ స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీటి వినియోగం కూడా అదే స్థాయిలో ఉండే సాధారణ కార్పొరేట్‌ కార్యాలయంతో పోల్చదగిన స్థాయిలో ఉండేలా డిజైన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

AI అప్లికేషన్లకు వేగవంతమైన కనెక్టివిటీ, తక్కువ లేటెన్సీ అందించడంలో విశాఖ AI హబ్‌ కీలకంగా మారనుంది. కేవలం డేటా సెంటర్‌ నిర్మించడం మాత్రమే కాకుండా.. కేబుల్‌ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి, విద్యుత్‌ ప్రసార వ్యవస్థ, డేటా సెంటర్‌ మౌలిక వసతులు, దేశీయ, అంతర్జాతీయ ఫైబర్‌ కనెక్టివిటీ వంటి అనేక అంశాలను సమన్వయం చేయాల్సి ఉంటుందని గూగుల్‌ పేర్కొంది.

మరోవైపు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 10 వేల మంది మహిళలకు ప్రాథమిక IT, AI నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని గూగుల్‌ యోచిస్తోంది. స్థానిక ప్రజలకు దీర్ఘకాలంలో అవసరమయ్యే నైపుణ్యాలపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. విశాఖ ప్రజలకు ‘గుడ్‌ నెయిబర్‌’గా ఉండేలా కమ్యూనిటీ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రాజెక్టు ప్రభావంపై స్వతంత్ర, శాస్త్రీయ, పారదర్శక నివేదికలను విడుదల చేయనున్నట్లు గూగుల్‌ వెల్లడించింది.

తొలి దశ నిర్మాణం పూర్తయ్యే కొద్దీ తదుపరి దశల పనులను మరింత వేగంగా చేపట్టే అవకాశం ఉందని గూగుల్‌ తెలిపింది. తొలి భవనం సాధారణంగా ఎక్కువ సమయం, వ్యయం తీసుకుంటుందని.. తొలి దశలో పొందే అనుభవాలు, నేర్చుకున్న అంశాల ఆధారంగా తర్వాతి దశల నిర్మాణ వేగాన్ని పెంచే అవకాశం ఉందని పేర్కొంది. 2028లో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభమైతే.. రాబోయే ఐదేళ్లలో విశాఖ కేవలం డేటా సెంటర్‌ నగరంగానే కాకుండా భారత్‌ AI కనెక్టివిటీకి ప్రధాన కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని గూగుల్‌ విశ్లేషిస్తోంది.

Related Posts