ఆరో దశ పోలింగ్.. అందరి దృష్టి ఢిల్లీ పైనే!

ఆరో దశ పోలింగ్.. అందరి దృష్టి ఢిల్లీ పైనే!

దేశవ్యాప్తంగా ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే ఓటర్ల క్యూ లైన్‌లో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14, బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. హరియాణాలో 10, ఢిల్లీలో 7, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. బీహార్‌లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 4 లోకసభ స్థానాలతో పాటు ఒడిశాలో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. 

 

Read More మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి..

అయితే ఈ దశలో అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్, బెయిల్ తర్వాత అన్ని పార్టీలు ఢిల్లీపై ఫోకస్ చేశాయి. కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఊహించని రీతిలో ప్రచారం చేశారు. ఆయన ప్రసంగం బీజేపీని ఇరుకున పెట్టేలా ఉంది. ఇక.. గత ఎన్నికల్లో ఢిల్లీలో ఏడుకు ఏడు స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఈ సారి మాత్రం ఆ పరిస్థితి ఉండదనే ప్రచారం ఉంది. ఏడు సీట్లూ ఇండియా కూటమి ఖాతాలోనే పడతాయని రాహుల్ గాంధీ చెబుతున్నారు. 

 

ఇప్పటి వరకు ఐదు విడతల్లో 428 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా.. ఆరో దశలో 58 ఎంపీ స్థానాలకు బరిలో 889 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ దశలో 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. జూన్ 1న ఏడో విడతలో 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్ సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.