మూడేళ్ల పాపను వదిలి గోదావరిలో దూకిన దంపతులు.. చించినాడలో విషాదం

మూడేళ్ల పాపను వదిలి గోదావరిలో దూకిన దంపతులు.. చించినాడలో విషాదం

  • పాపను వదిలి గోదావరిలో దూకిన తల్లిదండ్రులు.. స్థానికులను కలచివేసిన ఘటన

West Godavari News: పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి వద్ద తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు తమ మూడేళ్ల కుమార్తెతో కలిసి బ్రిడ్జి వద్దకు వచ్చినట్లు సమాచారం. అనంతరం చిన్నారిని స్కూటీపై వదిలి దంపతులు ఇద్దరూ గోదావరి నదిలో దూకినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు నదిలోకి వెళ్లిపోవడంతో మూడేళ్ల చిన్నారి చీకట్లో ఒంటరిగా మిగిలిపోయింది. చలికి వణుకుతూ ‘అమ్మా.. నాన్న’ అంటూ ఏడుస్తూ వారి కోసం ఎదురుచూస్తున్న చిన్నారిని చూసిన స్థానికులు తీవ్రంగా చలించిపోయారు. వెంటనే చిన్నారిని చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గోదావరి నదిలో దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సమస్యలు లేదా ఇతర కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Read More నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?

మరోవైపు తల్లిదండ్రుల కోసం చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రులు కనిపించకపోవడంతో చిన్నారి పడుతున్న ఆవేదన స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు చిన్నారిని సంరక్షణలోకి తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దంపతుల ఆచూకీ లభించిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Related Posts