ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరణ
- ఈనెల 19న డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
- పోలీసు గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ
- వేదబ్రాహ్మణుల ఆశీర్వచనాల అనంతరం బాధ్యతలు స్వీకరణ
ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది కొత్త డీజీపీకి గౌరవ వందనం సమర్పించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలు, ఆశీర్వచనాల అనంతరం డీజీపీ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు.
ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర పోలీస్ బాస్‌గా నియమించారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఈనెల 19వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ద్వారకా తిరుమల రావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గత నెలలో ఏపీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
ఆ సమయంలో ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ డీజీపీగా ఛాన్స్ ఇచ్చారు. ఈసీ నిర్ణయంతో ఎన్నికల నిర్వహణ మొత్తం హరీష్ గుప్తా డీజీపీగానే కొనసాగించింది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక ద్వారకా తిరుమలరావు పోలీస్ బాస్ అయ్యారు.