హత్య చేసిన వారంలోపే నిందితుడి ఆటకట్టించిన అనంతపురం వన్ టౌన్ సీఐ టీమ్

హత్య చేసిన వారంలోపే నిందితుడి ఆటకట్టించిన అనంతపురం వన్ టౌన్ సీఐ టీమ్

  • మొదటి భార్య విడాకులిచ్చినా మారని బుద్ధి... రెండో భార్యను పొట్టనబెట్టుకున్న ఉన్మాది

Anantapur: అనంతపురం టౌన్‌లో భార్యను హత్య చేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10వ తేదీ రాత్రి ఎల్లమ్మకాలనీలో నివాసం ఉంటున్న కుంటెల్ల మహేష్ తన భార్య బండారు శాంతిని రోకలి బండతో ముఖంపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆగస్టు 16వ తేదీ సాయంత్రం టీవీ టవర్‌ సమీపంలో మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు అనంతపురం వన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి. వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

Read More కొరియర్ బాయ్‌తో వివాహేతర సంబంధం.. భర్త హత్యకు భార్య కుట్ర

పోలీసుల వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామానికి చెందిన మహేష్‌కు గతంలో పెనుకొండ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. ఆమెను పదేపదే అనుమానించడంతో భార్య అతనికి విడాకులు ఇచ్చి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గుంటూరుకు చెందిన శాంతిని సుమారు నెల రోజుల క్రితం శ్రీశైలంలో వివాహం చేసుకున్న మహేష్‌ అనంతపురం టౌన్‌లో కాపురం పెట్టాడు.

అయితే శాంతిపై కూడా మహేష్‌ అనుమానం కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తేవని, శాంతి తన భర్త ప్రవర్తనను వ్యతిరేకించడంతో మహేష్‌ విచక్షణ కోల్పోయి ఆమెపై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. రోకలి బండతో బలంగా కొట్టడంతో శాంతి మృతి చెందినట్లు పేర్కొన్నారు.

కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానం, కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీయడంతో ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Tags: