సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారు.. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం

సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారు.. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం

  • పోలీసుల తోపులాటలో కిందపడిన జగదీష్‌రెడ్డి.. యాదవ్‌రెడ్డి కాలికి గాయం

Telangana Assembly BRS: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసన చేపట్టారు. గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వైపు నిరసనగా బయలుదేరిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, 1000 రోజుల పాలనలో ప్రజలకు చెప్పుకోదగ్గ ఫలితాలు లేవని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అవమానకరంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసులు ఆమె చీర పట్టుకుని లాగారని, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల దుస్తులు, టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడంలో తప్పేముందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కిందపడిపోయారని, ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి కాలికి గాయమైందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే పోలీసుల చర్యలపై పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Read More సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు.. హరీశ్‌రావు ఘన నివాళి

అసెంబ్లీ సమావేశాలను కేవలం తూతూమంత్రంగా నిర్వహించకుండా కనీసం నెల రోజుల పాటు నిర్వహించి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించేలా స్పీకర్ చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయని, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వారి సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తుతామని తెలిపారు. అలాగే 22ఏ పేరిట జరుగుతున్న వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో వైఫల్యాలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.