ఆదిభట్లలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి.. 22 మంది అరెస్ట్

ఆదిభట్లలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి.. 22 మంది అరెస్ట్

  • ఆదిభట్లలో భారీగా కోడి కత్తులు, నగదు స్వాధీనం.. 22 మంది అదుపులోకి

Adibatla News: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న పాత పౌల్ట్రీ ఫారమ్‌లో గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు, బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈ దాడి చేపట్టారు. దాడి సమయంలో కోడిపందేలు, జూదంలో పాల్గొంటున్న 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ తనిఖీల్లో 31 పందెం కోళ్లతో పాటు 146 కోడి కత్తులు, రూ.3,60,510 నగదు, 20 స్మార్ట్‌ఫోన్లు, పేకాటకు సంబంధించిన స్కోర్‌బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పందెం కోసం ప్రత్యేకంగా కోళ్లను పెంచుతున్నట్లు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లను రప్పించి కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read More కొండా కుటుంబాన్ని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలి

ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాన నిర్వాహకుడు, స్థల యజమాని పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న 22 మందిని, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి దర్యాప్తు కోసం ఆదిభట్ల పోలీసులకు అప్పగించారు. కోడిపందేలు, బెట్టింగ్, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు.

 

Related Posts