అపిలేపల్లిలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు.. ఖాళీ బిందెలతో నిరసన
- ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు.. అపిలేపల్లిలో ఉద్రిక్తత
Anantapur News: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై మహిళలు ఆందోళనకు దిగారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతూ ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి అవసరాలకు సరిపడా నీరు అందక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని ఆరోపించారు. దీంతో చేసేదేమీ లేక రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్సులు నిలిచిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అపిలేపల్లి గ్రామంలోని తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.



