కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది : ఉండవల్లి అరుణ్
ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద ఆధారపడి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చిందని చెప్పారు. ఒకవేళ చంద్రబాబుతో పొత్తులు లేకుంటే మాత్రం ఎన్డీయే అధికారంలోకి రాకపోయేది. కాబట్టి ఇలాంటి సమయంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు లాంటివి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపీ.. అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని చెప్పారు. ఏపీలో మద్యం ధరల పెరుగుదలతోనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందని జోస్యం చెప్పారు. జగన్ ఇప్పటికైనా తన కార్యకర్తలతో కలిసి వారి సమస్యలపై చర్చించాలని సూచించారు ఉండవల్లి అరుణ్ కుమార్.