అనంతపురంలో అంబేద్కర్‌కు అవమానమా?.. ఎస్టీ కమిషన్ చైర్మన్‌పై రామప్ప నాయక్ ఫైర్

అనంతపురంలో అంబేద్కర్‌కు అవమానమా?.. ఎస్టీ కమిషన్ చైర్మన్‌పై రామప్ప నాయక్ ఫైర్

  • అంబేద్కర్ వారసుల మనోభావాలను దెబ్బతీశారు.. రామప్ప నాయక్ తీవ్ర ఆగ్రహం

Anantapuram News: అనంతపురం జిల్లా కేంద్రానికి వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ బుజ్జిరెడ్డి, కమిషన్ సభ్యుడు వెంకటప్పలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించకపోవడంపై ప్రజాబలం సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రామప్ప నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి వచ్చిన వారు అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పట్టించుకోకపోవడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు.

అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామప్ప నాయక్ మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా పదవులు అనుభవిస్తున్న వారు ఆయనను విస్మరించడం సరికాదని అన్నారు. అంబేద్కర్‌ను గౌరవించకపోవడం కోట్లాది మంది బహుజనులు, దళిత, గిరిజన ప్రజలు, అంబేద్కర్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More విజయవాడలో డీఎస్సీ 2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ

ఎస్టీ కమిషన్ చైర్మన్ బుజ్జిరెడ్డి, సభ్యుడు వెంకటప్ప వ్యవహరించిన తీరు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రామప్ప నాయక్ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు మహానీయుల పట్ల కనీస గౌరవాన్ని పాటించాలని, అధికారిక పర్యటనలకు వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ వంటి మహనీయుల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు ఎస్టీ కమిషన్ చైర్మన్ బుజ్జిరెడ్డి, సభ్యుడు వెంకటప్ప వెంటనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు, ఆయనను అభిమానించే ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామప్ప నాయక్ డిమాండ్ చేశారు. వెంటనే స్పందించి క్షమాపణ చెప్పకపోతే ప్రజాబలం సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags:  

Advertisement