సిర్నాపల్లి సొసైటీ ముందు రైతుల ఆందోళన

సిర్నాపల్లి సొసైటీ ముందు రైతుల ఆందోళన

  • యూరియా యాప్ విధానం రద్దు చేయాలని రైతుల డిమాండ్

Sirnapalli: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో యూరియా పంపిణీపై రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, గతంలో మాదిరిగా మాన్యువల్ పద్ధతిలో రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ సిర్నాపల్లి సొసైటీ కేంద్రం ముందు నిరసన చేపట్టారు.

సిర్నాపల్లి గ్రామంలోనే సొసైటీ ఉన్నప్పటికీ స్థానిక రైతులకు యూరియా సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం యాప్‌లో బుకింగ్ చేసుకునే విధానం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యవసాయ పనుల సమయంలో అవసరమైన ఎరువు దొరకక తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు.

Read More స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కేసు నమోదు

మరోవైపు పక్క గ్రామాల నుంచి రైతులు వచ్చి యాప్‌లో బుకింగ్ చేసుకుని సిర్నాపల్లి సొసైటీ నుంచి యూరియా తీసుకెళ్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. దీంతో సొసైటీ పరిధిలోని రైతులకు సరిపడా యూరియా అందడం లేదని పేర్కొన్నారు. తమ గ్రామ రైతులకు ముందుగా యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యాప్ విధానం వల్ల ఏర్పడుతున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని రైతులు కోరారు. యూరియా పంపిణీలో స్థానిక రైతులకు ప్రాధాన్యత కల్పించి, మాన్యువల్ పద్ధతిలో సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగించారు.