అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్‌ల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు

అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్‌ల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు

  • పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌ల ఆందోళన

Telangana Sarpanches JAC: తెలంగాణ అసెంబ్లీ వద్ద మాజీ సర్పంచ్‌లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ నేతృత్వంలో మాజీ సర్పంచ్‌లు బుధవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గ్రామపంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (SFC) నిధులను తక్షణమే విడుదల చేయడంతో పాటు గ్రామపంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని మాజీ సర్పంచ్‌లు కోరారు. తమ హయాంలో గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఈ డిమాండ్లతో అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు మాజీ సర్పంచ్‌లు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని మాజీ సర్పంచ్‌లు స్పష్టం చేశారు. గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు, బిల్లులను విడుదల చేసి తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Related Posts