తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ -డా.కాచం సత్యనారాయణ.
ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
విశ్వంభర, సరూర్ నగర్ :-తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని వి 3, విశ్వంభర దినపత్రిక చైర్మన్ డా కాచం సత్యనారాయణ అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఉద్యమ నాయకులు బొడ్డు హరిబాబు, కంచర్ల శేఖర్, పగడాల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐలమ్మ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో 1919లో జన్మించిన ఐలమ్మ, నిజాం కాలంలో విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని ఎదిరించిన ధీర వనిత అని అన్నారు. తనకు చెందిన నాలుగు ఎకరాల భూమి కోసం దొరలతోనే న్యాయపోరాటం చేసి గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.ఆమె చేసిన తెగువ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది. దొరల గుండాలకు భయపడకుండా గొడ్డలి పట్టుకుని తిరగబడిన ఐలమ్మ స్ఫూర్తితోనే వేలాది మంది రైతులు పోరాటంలోకి దిగారు. ఐలమ్మ త్యాగం, పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కె పురం డివిజన్ మాజీ యూత్ అధ్యక్షుడు శ్యామ్ గుప్తా, దీపక్, కపిల్, రాజు, నగేష్ ,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.



