అనంతపురంలో ది ట్రెల్లిస్ స్కూల్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి
- మైనర్ బాలికపై లైంగిక దాడి.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు ఎప్పుడు?
Anantapur The Trellis School: అనంతపురం నగరంలోని ది ట్రెల్లిస్ ప్రైవేట్ పాఠశాలలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపుతోంది. బాలికపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెపై రెండుసార్లు లైంగిక దాడి జరిగినట్లు వారు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాలికకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదే సమయంలో పాఠశాల యాజమాన్యం పాత్రపై కూడా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ది ట్రెల్లిస్ స్కూల్‌ను సీజ్ చేయాలని కోరుతూ డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నారు
మరోవైపు, తమకు రాజకీయ బలం ఉందని, మీడియాను కూడా తమకు అనుకూలంగా మార్చుకోగలమని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఘటనపై ప్రశ్నించేందుకు వచ్చిన విద్యార్థి సంఘాల విషయంలోనూ పోలీసులు సరిగా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైనర్ బాలికకు న్యాయం చేయడంతో పాటు దాడికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.



