మూడు గంటల కరెంటంటూ తప్పుడు ప్రచారం సరికాదు: ముత్యాలప్ప

మూడు గంటల కరెంటంటూ తప్పుడు ప్రచారం సరికాదు: ముత్యాలప్ప

  • రైతుల సమస్యలపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై ముత్యాలప్ప ఫైర్

Palacherla Muthyalappa: రాప్తాడు రైతుల కోసం ధర్నాలు చేస్తున్నానంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు.

ప్రకాష్‌రెడ్డి సొంత గ్రామమైన తోపుదుర్తిలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారని ముత్యాలప్ప తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లోనూ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో రైతుల కోసం ఇలాంటి సబ్‌స్టేషన్లు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో ప్రకాష్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

Read More అనంత లక్ష్మి కళాశాలలో అవగాహన సదస్సు.. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీఐ హేమంత్ కుమార్

రైతులకు కేవలం మూడు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ ప్రకాష్‌రెడ్డి చేస్తున్న ప్రచారం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందని ముత్యాలప్ప అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు లేదా తాత్కాలిక అంతరాయాలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. సమస్యను పరిష్కరించకుండా రైతుల్లో అపోహలు కలిగించేలా ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు.

రైతు ప్రయోజనమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముత్యాలప్ప స్పష్టం చేశారు. వ్యవసాయ సీజన్‌లో రైతులకు అవసరమైన విద్యుత్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతుల సమస్యలను రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని, ధర్నాల పేరుతో రాజకీయ ప్రచారం చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని హితవు పలికారు. అమరావతి సహా ఇతర అభివృద్ధి అంశాలను రైతుల విద్యుత్ సమస్యలతో ముడిపెట్టి రాజకీయాలు చేయడం సరికాదని ముత్యాలప్ప పేర్కొన్నారు.