స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి యత్నం.
-పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట. -గాయపడ్డ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ .
విశ్వంభర, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్: - అసెంబ్లీ వద్ద బిఆర్ఎస్ పార్టీ నిరసన నేపథ్యంలో ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డిని కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు, ఈ క్రమంలో పోలీసులకు, నాయకులు–కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో గూడూరు శ్రీనివాస్ గాయపడి అస్వస్థతకు గురి కాగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం అస్వస్థత కారణంగా ప్రజ్ఞాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడుకున్న రాజకీయం చేసిందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుండి విలువలను తుంగలో తొక్కి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు అని గూడూరు శ్రీనివాస్ మండిపడ్డారు. ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు తమ తీరును మార్చుకుని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా స్పీకర్ కు క్షమాపణలు చెప్పి తమ నాయకులు కార్యకర్తలు చేసిన పనిని కేసీఆర్, హరీష్ రావులు ఖండించాలని వారు కోరారు.



