బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి చేసిన మహిళలు.. మీసం తిప్పాడనే..
విశ్వంభర, హైదరాబాద్ : మహిళా లోకం ఆగ్రహిస్తే అవతలి వ్యక్తి ఎవరైంది చూడరనేదానికి నిదర్శనం ఈ సంఘటన. అధికార బలం, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నా ఆడవాళ్ల ప్రతాపం ముందు దిగదుడుపే అని నిరూపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేపై చెప్పుల దాడి చేశారు. అయితే మహిళల ఆగ్రహానికి ఎమ్మెల్యే అనుచరుడు మీసం తిప్పడమేనని తేలింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన తన అనుచరులతో బోరబండలో ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో బోరబండ సైట్ 3 హైటెక్ హోటల్ ముందుకు రాగానే స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఎదురు పడ్డాడు. దీంతో ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు విజయ్ సింహ మహిళలను చూస్తూ మీసం తిప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన మహిళలు.. మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా మమ్ముల్ని చూసి మీసం తిప్పుతావా అంటూ చెప్పులతో దాడి చేశారు. మహిళలు మూకుమ్మడిగా చెప్పులు విసరడంతో అవి ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరుడిపై పడ్డాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై రెండు గ్రూపులను చెదరుగొట్టారు.