రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క.. రుణమాఫీపై క్లారిటీ
విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెంః తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దానిపై క్లారిటీ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఆరు నూరైనా సరే రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు.
ఆగస్టు 15 కన్నా ముందే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందిస్తామని.. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతు భరోసాను కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వబోమని.. రైతులతో మాట్లాడిన తర్వాత విధి, విధానాలను రూపొందిస్తామన్నారు.
రైతుల అభిప్రాయాలను తీసుకుని కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చలు జరిపిన తర్వాత దానిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గురువారం రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.