2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: ప్రధాని మోడీ
- 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని
- 101 ఏళ్ల ఫ్రాన్స్ మహిళా యోగా గురుకు ప్రశంసలు
2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శ్రీనగర్‌లోని డాల్ సరస్సు సమీపంలో ఇవాళ(శుక్రవారం) నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు గుర్తుచేశారు.
యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు ప్రధాని తెలిపారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ యోగాపై అవగాహన కల్పించడానికి తన జీవితాన్ని ధారపోసిందని ప్రశంసించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయని మోడీ ఉద్ఘాటించారు.
ప్రధాని మోడీ రాక నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్- ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు.