యూరియా కోసం గణపతి మండపంలో లక్కీ డ్రా.. నిజామాబాద్‌లో వినూత్న నిరసన
- రూ.99 టోకెన్‌తో మూడు యూరియా బస్తాలు గెలుచుకునే అవకాశం
Nizamabad News: నిజామాబాద్ జిల్లా రూప్లా తండాలో యూరియా కోసం బంజారా కింగ్స్ యూత్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. యూరియా కొరతను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గణపతి మండపంలో లక్కీ డ్రా నిర్వహించారు.
రూ.99 విలువైన లక్కీ డ్రా టోకెన్‌ను ఏర్పాటు చేసి, అందులో విజేతలకు మూడు యూరియా బస్తాలు అందించే అవకాశం కల్పించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యూత్ సభ్యులు తెలిపారు.
యాప్‌లో యూరియా కోసం బుక్ చేసుకున్నప్పటికీ, బస్తాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుకింగ్ చేసిన రైతులకు యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూరియా సమస్యపై అధికారులు వెంటనే స్పందించి రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని బంజారా కింగ్స్ యూత్ సభ్యులు కోరారు. సమస్యను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు తెలిపారు.



