అనంతపురం సర్వజనాస్పత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ

అనంతపురం సర్వజనాస్పత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ

  • ఓపీ విభాగాల్లో హెచ్‌వోడీలు లేకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి

Anantapur Government Hospital: అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల వార్డులను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, వైద్యుల అందుబాటు, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని ఓపీ విభాగాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ఓపీ సేవల కోసం క్యూలైన్లలో వేచి ఉన్న రోగులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓపీ విభాగాల్లో హెచ్‌వోడీలు అందుబాటులో లేకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు.

ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ప్రస్తుతం 560 పడకలు మాత్రమే ఉన్నప్పటికీ, ఇన్‌పేషెంట్ల సంఖ్య సుమారు 1,200కు చేరుతోందన్నారు. ప్రతిరోజూ సుమారు 2,300 మంది ఓపీ సేవల కోసం వస్తున్నారని తెలిపారు. దీంతో అందుబాటులో ఉన్న సిబ్బంది, మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఆస్పత్రికి అవసరమైన అదనపు సౌకర్యాలు, సిబ్బంది అంశాలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు.

Read More విశాఖలో గూగుల్‌ AI హబ్‌.. తొలి దశలో 1 GW డేటా సెంటర్‌

గత ఐదేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్‌ఆర్‌ నిధులను వినియోగించి ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలు, సిబ్బంది, మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

Related Posts