ఉరవకొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్

ఉరవకొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్

  • పోలీసులు–వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు

Visweswara Reddy: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉరవకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుని పోలీసుల చర్యను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యేను పోలీసులు తీసుకెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి తోపులాటకు దారితీసింది.

పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డిని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు.  మాజీ ఎమ్మెల్యేను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే విషయంపై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనతో ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, వైసీపీ నాయకులు పోలీసుల చర్యను ఖండిస్తున్నారు. మరోవైపు, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More హత్య చేసిన వారంలోపే నిందితుడి ఆటకట్టించిన అనంతపురం వన్ టౌన్ సీఐ టీమ్