రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు
- వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు
- రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు
- వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇవాళ ఒక్కరోజే 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలలో పాల్గొంటారని తెలుస్తోంది. గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు సీఎం హాజరుకానున్నారు. అలాగే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఆర్థిక మంత్రితోనూ భేటీ కానున్నారు.
వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈఓ షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈఓ జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈఓ కాత్ మెక్‌లే, సిస్కో సీఈఓ చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించనున్నారు.
అంతేగాక బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు.