నగరంలో మరో దారుణం.. 12ఏళ్ల బాలిక హత్య..!
- వారం రోజుల కిందట బాలిక మిస్సింగ్
- చెత్తకుప్పలో పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం
- పోలీసులు పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపణ
హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున బాలికను దారుణంగా హత్య చేశారు. 12 ఏళ్ల బాలికను హత్య చేసి తగలబెట్టి చెత్త కుప్పలో పడేశారు. పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తప్పిపోయి వారం రోజులు అవుతోంది.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం లక్ష్మా తండాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చింది. ఈ నెల 7వ తేదీన వారి పెద్ద కుమార్తె(12) కిరాణా షాపు వద్దకు వెళ్లి వస్తానని తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో బాలిక కోసం చుట్టపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరికి బాలిక తప్పిపోయిన వారం రోజులకు చెత్తకుప్పలో తగలబెట్టి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వదిలించుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ దక్కేదని బాలిక తల్లిదండ్రులు రోధిస్తున్నారు.



