రేణిగుంట రైల్వే స్టేషన్‌లో హైడ్రామా.. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు
- ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి ఎక్కి హల్‌చల్.. సురక్షితంగా కాపాడిన అధికారులు
Renigunta Railway Station: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అస్సాంకు చెందిన ఓ యువకుడు ఫ్లాట్‌ఫామ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ చేయడంతో ప్రయాణికులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం సుమారు 5 గంటల నుంచి కొనసాగిన పరిస్థితిని ఎట్టకేలకు అధికారులు అదుపులోకి తీసుకువచ్చారు.
యువకుడిని సురక్షితంగా కాపాడేందుకు అధికారులు ముందుగా రైల్వే హైటెన్షన్ విద్యుత్ లైన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ట్రాక్‌పై అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో సేఫ్టీ నెట్‌ను ఏర్పాటు చేశారు. యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రైల్వే, అగ్నిమాపక శాఖ సిబ్బంది సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టారు.
ఇదే సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సమీపంలో నిలిచిన రైలు పైకప్పుపైకి కొందరు సిబ్బంది ఎక్కి యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాల మధ్య యువకుడు ఒక్కసారిగా కిందికి దూకాడు. అదృష్టవశాత్తూ కింద ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌లో పడటంతో అతడికి పెద్ద ప్రమాదం తప్పింది.
అనంతరం అధికారులు యువకుడిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు, అతడి పరిస్థితి తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన కారణంగా రేణిగుంట రైల్వే స్టేషన్ పరిధిలో కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి–రేణిగుంట జంక్షన్ మీదుగా చెన్నై, హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు సమాచారం.



