బావిలో సముద్ర అలలు!.. గుజరాత్‌లో వింత ఘటన కలకలం

బావిలో సముద్ర అలలు!.. గుజరాత్‌లో వింత ఘటన కలకలం

  • గుజరాత్‌లో వింత దృశ్యం.. బావిలో అలల్లా ఎగసిపడుతున్న నీరు

Gujarat Well Waves: గుజరాత్‌లో ఓ బావిలో నీరు సముద్ర అలల్లా ఎగసిపడుతున్న అరుదైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని విర్పర్దా గ్రామంలో రైతు ప్రాంజీవన్ భాయ్‌కు చెందిన పొలంలోని బావిలో ఈ అసాధారణ కదలికలు కనిపించడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. బావిలో నీరు నిరంతరం అలల మాదిరిగా కదులుతుండటంతో ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

స్థానికుల సమాచారం.. మంగళవారం కొంతసేపు ఈ కదలికలు తగ్గినప్పటికీ, బుధవారం మళ్లీ అదే స్థాయిలో నీటిలో అలలు కనిపించాయి. భూమిలోని రాతి పొరల మధ్య చిక్కుకున్న వాయువుల ఒత్తిడి కారణంగానే ఈ తరహా కదలికలు ఏర్పడి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం భూగర్భ శాస్త్ర నిపుణులతో సమగ్ర పరిశీలన చేపట్టారు.

Read More పార్కుల జోలికి రావొద్దు.. లాల్‌బాగ్‌లో బెంగళూరువాసుల ఆందోళన

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. బావిలో కనిపిస్తున్న అలల వెనుక గల అసలు కారణాలను శాస్త్రీయంగా పరిశీలిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. 

బావిలో సముద్ర అలలను తలపించే ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ వింత దృశ్యం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.