దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..! 

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..! 

సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చిన రైతులు వాహనాల రాకపోకను అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ సన్న ధాన్యానికే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సన్న రకం ధాన్యం మార్కెట్‌కు రాదని, అది ఎక్కువగా మిల్లులలోనే అమ్ముడుపోతుందని తెలిపారు. ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తుంటారని తెలిపారు.

Read More  కొండా సురేఖపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేశా: రఘునందన్ రావు

కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడంటూ గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఇవ్వడంలేదని వాపోయారు. కరెంట్ సైతం సరిగా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రైతుబంధు పంట చివరలో ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో తమ పంటలు ఎండిపోవడంతో ఉన్న కొద్ది పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు.