సమంత, నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణం.. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటాడు: కొండా సురేఖ
హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అన్న సురేఖ
కేటీఆర్ కు తల్లి, అక్క, చెల్లెలు లేరా? అని ప్రశ్న
దుబాయ్ నుంచి తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపాటు
విశ్వంభర : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటేనని ఆమె అన్నారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆయనే అని మండిపడ్డారు. వారికి డ్రగ్స్ అలవాటు చేశాక... వారి ఫోన్లను ట్యాప్ చేశారని అన్నారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ కు తల్లి, అక్క, చెల్లెలు లేరా? అని సురేఖ ప్రశ్నించారు. తనపై బీఆర్ఎస్ వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని అడిగారు. మంత్రి సీతక్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మనసున్న మనిషిగా ఈ అంశంపై హరీశ్ రావు స్పందించాలని కోరారు.
బీఆర్ఎస్ లో తాను ఐదేళ్లు పని చేశానని... తన వ్యక్తిత్వం ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసని సురేఖ అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలని... అంతేకానీ, వ్యక్తిత్వాలను చంపే ప్రయత్నం చేయకూడదని చెప్పారు. బీఆర్ఎస్ లో రాజకీయ విలువలు దిగజారి పోయాయని దుయ్యబట్టారు. దుబాయ్ నుంచి నాలుగు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తనపై నీచమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేశామని చెప్పారు.