మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
- బాల్యంలోనే పునాది పడాలి
- సినీ నటి మానసా చౌదరి
విశ్వంభర, హైదరాబాద్ : మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, దానికి బాల్యంలోనే పటిష్టమైన పునాది పడాలని సినీ నటి మానసా చౌదరి తెలిపారు. బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) ఆధ్వర్యంలో బంగారు తల్లి 467వ టాలెంట్ ఫ్యాక్టరీ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికా సాధికారతకు బీబీజీ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఈ సహకారంతో బాలికలు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సీఎండీ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ బాలికా సాధికారతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. విద్య, కళల ద్వారా మహిళల సామాజిక పురోగతిలో ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాలికా సాధికారతకు నిరంతరం శ్రమిస్తున్న బృందానికి అభినందనలు తెలిపారు. 2040 నాటికి రెండు మిలియన్ల మంది బాలికలకు సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీ శ్రీనివాస్ రావు, కస్తూరి ఉష, నీరజ అంకపల్లి మానసా చౌదరి సమక్షంలో రూ. 30 లక్షల చెక్కును బంగారు తల్లికి అందజేశారు.