ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

  • పేపర్ బ్యాలెట్లు వాడాలని డిమాండ్
  • ప్రజాస్వామ్యం నిస్సందేహంగా ఉండాలంటూ హితవు

ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్‌ బ్యాలెట్లు వాడాలంటూ ట్వీట్ చేశారు. 

"న్యాయం జరగడమే కాదు.. అది ప్రజలకు కనిపించాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాదు.. నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనమూ అదే దిశగా పయనించాలి." అని జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాల రోజే సీఎం జగన్ ఈవీఎంలపై పరోక్షంగా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. తాము ప్రజలకు ఎంతో మేలు చేసినా ఓట్లు ఏమయ్యాయో అర్థం కాలేదన్నారు. దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ వాటికి ఆధారాలు లేవని చెప్పారు. ఇప్పుడు నేరుగా జగన్ మోహన్ రెడ్డే ఈవీఎంలపై విమర్శలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా నెటిజన్లు స్పందిస్తూ 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసినప్పుడు మాట్లాడిన జగన్ స్పీచ్‌ను వైరల్ చేస్తున్నారు.