గ్రామాలలో ప్రభలుతున్న విష జ్వరాలు

..మండల వ్యాప్తంగా పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకోని అధికారులు
...సమీపిస్తున్న సీజనల్‌ వ్యాధుల కాలం
...కొన్ని గ్రామాలలో ప్రభలుతున్న విష జ్వరాలు
...సర్పంచుల పదవీ కాలం ముగియడంతో తలలు పట్టుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు 
...గ్రామాలలో జాడకులేని స్పెషల్ ఆఫీసర్లు
...గ్రామాల పూర్తి భారం మోయలేమంటున్నా కార్యదర్శులు 
...పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యానికి అడ్డాగా మారిన ప్రభుత్వ కళాశాల రహదారి 

11

విశ్వంభర చింతపల్లి జులై 11:- రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పదవీ కాలం ముగియడంతో చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులను ఆయా గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. కాని స్పెషల్ ఆఫీసర్లు మాత్రం వారాంతంలో ఒక్క రోజైనా వారికి కేటాయించిన గ్రామ పంచాయతీలకు రావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ ఆలుకా జైహింద్ రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల రోడ్డు పక్కన చెత్తా చెదారంతో అపారిశుద్ధ్యం నెలకొంది. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు ఉపయోగించిన చెత్తచేదారంతో పాటు కుళ్ళిపోయిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చికెన్ వ్యర్థాలు, వివిధ రకాల ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వస్తువులన్ని ఒకే చోట పడేయడంతో ఆ ప్రాంతం డంపింగ్‌ యార్డులను తలపిస్తుంది. కుళ్ళిపోయినవన్నీ రోడ్డు పక్కనే పడేయడంతో తీవ్రమైన దుర్వాసన వస్తుంది. వ్యర్థాలను తినేందుకు పందులు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తూ బాటసారుల పై దాడి చేస్తున్నాయి. ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించే స్థానిక గ్రామస్తులు, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దోమలు వ్యాప్తి చెందడంతో ఆ చుట్టుపక్కలనున్న నివాస గృహాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో పెద్ద వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దుర్వాసనతో పాటు దోమలు మరింత వద్ధి చెందే అవకాశం ఉందని దానివల్ల వ్యాధులు మరింత ప్రభలే అవకాశముంటుందని గ్రామ ప్రజలు భయ పడుతున్నారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో పేరుకుపోయిన పారిశుద్ధ్యన్ని వెంటనే తొలగించి, భవిష్యత్తులో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

Read More *గ్రూప్- 2 గ్రూప్- 3 పరీక్షలను నెలరోజులు వాయిదా వేయాలి. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదు.

ముంచుకొస్తున్న ముప్పు..

ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకినట్లు వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించారు. దీంతో మరో వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వర్షాలు కురిస్తే మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో పారిశుధ్యం మరింత అధ్వానంగా మారే అవకాశం ఉంది. ఇకనైనా అధికారులు అప్రమత్తంకాకుంటే ఆపదలు తప్పవంటున్నారు.  వానకాల సీజన్‌లో ప్రధానంగా మలేరియా,టైఫాయిడ్‌, విషజ్వరాలు, డయేరియా లాంటి వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా దోమల నివారణ, పారిశుధ్యం నివారణ లాంటి పనులను చేపట్టాల్సి ఉంటుంది. కానీ గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకు పోవడంతో తొలకరి వర్షాలకే మురికి నీటి కాలువలు నిండిపోయి రోడ్లపై వర్షపు నీరు ప్రవహించి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరే అవకాశం ఉంది. మురికి నీటి కాల్వల పూడిక పనులను కూడా తక్షణమే చేపట్టాల్సి ఉంది. ఏదో ఉన్నతాధికారుల పర్యటనల సందర్భంగానే ప్రభుత్వ అధికారులు హడావుడి చేస్తున్న ఆ తర్వాత అంతా మాములుగానే మారిపోతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే తప్పా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టలేరని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.