20 రోజులకు దొరికిన వడ్డే యల్లయ్య మృతదేహం

20 రోజులకు దొరికిన వడ్డే యల్లయ్య మృతదేహం

విశ్వంభర, సూర్యాపేట : గత నెల 18న మిస్సింగ్ అయిన సూర్యాపేట జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ నక్సలైట్ వడ్డే యల్లయ్య (58)దారుణహత్యకు గురయ్యినట్టు నిర్థారణ అయింది. 20 రోజులుగా కొనసాగిన సస్పెషన్‌కు తెరపడింది. ఏప్రిల్ 18న ఓ సెటిల్ మెంట్ కోసమని ఓ మహిళతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా జగ్గయ్యపేట వెళ్లిన యల్లయ్య అదే రోజు దారుణ హత్యకు గురయ్యారు. భర్త మిస్సింగ్ పై ఆయన భార్య యాదమ్మ సూర్యాపేట, జగ్గయ్య పేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది.

తిరుమలగిరికి చెందిన శ్రీకాంత్ చారికి, వడ్డే యల్లయ్యకు మధ్య రియల్ ఎస్టేట్  వ్యాపారంలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో ఇద్దరు మధ్య తేడాలు రావడంతోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏప్రిల్ 18న సూర్యాపేట నుండి కారులో మహిళతో కలిసి సెటిల్మెంట్ పనిమీద జగ్గయ్యపేటకు వెళ్లిన యల్లయ్యను పథకం ప్రకారం ఒక గదిలోకి తీసుకెళ్లి కర్రలతో  కొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని జగ్గయ్యపేట మండలం బండిపాలెం పరిసరాల్లోని  అటవీ ప్రాంతంలో  పెట్రోల్ పోసి కాల్చి గుంతలో పూడ్చిపెట్టారు. ఈ కేసులో శ్రీకాంత్ చారిని అనుమానిస్తూ జగ్గయ్యపేట పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోని విచారించడంతో హత్య కోణం బయటపడింది. ఈ మేరకు బుధవారం నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా  బండిపాలెం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, సూర్యాపేట ప్రాంతంలో జరిగిన ఐదు హత్య కేసుల్లో యల్లయ్య ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు  పోలీసులు తెలిపారు.

Related Posts