భారత్ ఆల్ టైమ్ రికార్డ్.. భారీగా పెరిగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు
భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ రికార్డ్ సాధించాయి. తొలిసారిగా 650 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి రికార్డు నెలకొల్పాయి.
భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ రికార్డ్ సాధించాయి. తొలిసారిగా 650 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి రికార్డు నెలకొల్పాయి. మే 31 నాటికి భారతదేశ ఫారెక్స్ నిల్వలు 651.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆ వారంలో 4.8 బిలియన్ డాలర్ల ఫండ్ పెరుగుదల కనిపించింది. ఫారెక్స్ ఫండ్ మునుపటి వారంలో 2 బిలియన్ డాలర్లు తగ్గింది. మే 31తో ముగిసిన వారంలో కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరింది.
మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫారెక్స్ నిల్వలు పెరిగాయని, ఫారెక్స్ ఫండ్ పెరుగుదలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్‌బిఐ ఈ సాయంత్రం ప్రచురించనున్నట్లు తెలిపారు. మే 24తో ఫారెక్స్ లిక్విడిటీ ఫండ్ 646.673 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే దాదాపు రూ.53.7 లక్షల కోట్ల ఫారెక్స్ నిధులు ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ బాహ్య కారకాల ప్రభావం లేకుండా పటిష్టంగా అభివృద్ధి చెందిందని భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఆర్‌బీఐ ఆరుగురు సభ్యుల ఎంపీసీ సమావేశం రెపో రేటును నిర్ణయించింది. 6.50కి కొనసాగించాలనే నిర్ణయానికి 4:2 మద్దతు లభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జడీపీ 7.2శాతం పెరగవచ్చని అంచనా వేసింది ఆర్‌బీఐ. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురుస్తాయని, ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని ఆర్‌బీఐ ఆశాజనకంగా ఉంది.