విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి.. కుమారస్వామికి పురంధేశ్వరి వినతి
విశ్వంభర, ఢిల్లీః విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పుడు ఆగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సారి ఎన్డీయే ప్రభుత్వమే కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొలువు దీరింది. కాబట్టి దానికి చొరవ చూపేందుకు ఏపీ బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇందులో భాగంగా తాజాగా ఆమె ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా.. అభివృద్ధి చేయాలంటే స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడమే అత్యుత్తమ ప్రత్యామ్నాయం అని ఆమె వివరించారు.
ఇక తమ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి మాట ఇచ్చినట్టు పురంధేశ్వరి తెలిపారు. ఇదే విషయంపై ఆమె త్వరలోనే అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రైవేటీకరణ ఆపడంపై కేంద్రం ఇంకా ఎలాంటి ఆలోచన చేయట్లేదని తెలుస్తోంది. ప్రభుత్వం వ్యాపారాలు చేయొద్దనే సంకల్పంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని గతంలోనే మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.