దేశ రాజధానిలో నీటి సంక్షోభం...మట్టి కుండలతో కాంగ్రెస్ నిరసన
విశ్వంభర, ఢిల్లీ : దేశ రాజధానిలో నీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రం అవుతున్న సంగతి తెలిసిందే. నగర ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. వాటర్ ట్యాంకర్ల వద్ద ఖాళీ బిందెలతో నీళ్ల కోసం ఎగబడుతున్న సంఘటనలు అనేకం. ఇదిలా ఉంటే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు శనివారం నగరమంతటా మట్టి కుండలను తలపై పెట్టుకుని నిరసన చేశారు. ఢిల్లీలోని మొత్తం 280 బ్లాకుల్లో ఉదయం 10 గంటలకు నిరసనలు ప్రారంభమయ్యాయి.
తలపై మట్టి కుండలతో, కాంగ్రెస్ జెండాలను చేతిలో పట్టుకుని నిరసనకారలు ఢిల్లీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ.. నీటి సమస్యల పరిష్కారం గురించి చర్చించడానకి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో నీటి కొరతను తీర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముందుగా సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని, దీంతో ప్రజలు నీటి ట్యాంకర్ల వెంట పరుగులు తీయాల్సి వచ్చిందని అన్నారు.
రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేయాలని అన్నారు. యమునా నదికి తక్కువ నీరు చేరుతున్నందున ఢిల్లీలో నీటి సరఫరా నిరంతరం తగ్గుతోందని మంత్రి అతిషి శుక్రవారం చెప్పారు. ఢిల్లీకి దక్కాల్సిన నీటి వాటాను బీజేపీ పాలిత హర్యానా విడుదల చేయడం లేదని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.