రైతులకు నష్ట పరిహారం అందిస్తాంఃభూపాలపల్లి కలెక్టర్
చట్టం ప్రకారం అందరికీ పరిహారం
గ్రీ్ ఫీల్డ్ నేషనల్ హైవేతో జిల్లా అభివృద్ధి
విశ్వంభర, భూపాలపల్లిః గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ పై టేకుమట్ల,చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాలకు చెందిన రైతులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మీ మండలాలు, గ్రామాల అభివృద్ధి కోసమే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 3 మండలాల పరిధిలోని 13 గ్రామాల రైతుల నుంచి భూ సేకరణ చేస్తామని వివరించారు.
రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. 350 ఎకరాలు 35 కిలో మీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వస్తుందని రోడ్డు నిర్మాణం కోసం 45 మీటర్ల వెడల్పు సేకరణ చేయాల్సి ఉన్నదన్నారు. భూ సేకరణ విషయంలో భూముల ధరలు, భూముల పట్టాలలో తప్పులు, కొంతమందికి పట్టాలు లేకపోవడం లాంటి విషయంలో ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తామని తెలిపారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందిస్తామని, అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్, నేషనల్ హైవే అధికారులు, మూడు మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు.