రేపు జూబ్లీహిల్స్‌లో పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం
సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలనా పగ్గాలను వేగంగా అందుకున్నారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలనా పగ్గాలను వేగంగా అందుకున్నారు. విదేశాల్లో పెట్టుబడుల వేట ముగియగానే, ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు, అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ కొత్త సారథి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు. వీరితో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకున్న ఇంచార్జ్ మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.
ఈ సమావేశం కేవలం సాధారణ భేటీ కాదని, రాష్ట్రంలో రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక దిశానిర్దేశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రులకు వారి పరిధిలోని అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన గడువులను విధించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి? జిల్లాల వారీగా అమలులో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? అనే అంశాలపై సీఎం నివేదికలు కోరనున్నారు. రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల బలోపేతం దిశగా పార్టీ క్యాడర్‌ను ఎలా సమాయత్తం చేయాలనే దానిపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి సీఎం చర్చించనున్నారు.
తన పర్యటనలో భాగంగా విదేశీ పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల గురించి కూడా సీఎం ఈ భేటీలో ప్రస్తావించనున్నారు. పాలనలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి, దానికి అనుగుణంగా మంత్రులను, పార్టీని ఎలా ముందుకు నడిపించాలనే దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.



